madurai temple: మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలోకి ఇకపై సెల్ ఫోన్లు నిషిద్ధం
- మార్చి 3 నుంచి అమల్లోకి
- మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశాలతో అధికారుల నిర్ణయం
- ఆలయ భద్రత కోసమే
మధురైలోని ప్రఖ్యాత మీనాక్షి అమ్మన్ ఆలయంలోకి సెల్ ఫోన్లను నిషేధిస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో ఆలయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భద్రతా అధికారులు మినహా మరెవరూ కూడా ఆలయంలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది.
ఆలయంలో భద్రత కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని సైతం నియమించాలని కోర్టు ఆదేశించింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆలయం వద్ద దుకాణాలు కాలిపోవడంతో భద్రతకు సంబంధించి కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆలయ భద్రత కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆలయ అధికారులు భద్రతా కోణంలో సెల్ ఫోన్లను నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.