sbi: డిపాజిట్ దారులకు మళ్లీ మంచి రోజులు... వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
- పలు రకాల కాల వ్యవధులపై అరశాతం వరకు పెరుగుదల
- నేటి నుంచే అమల్లోకి
- కొత్త డిపాజిట్లకు, రెన్యువల్ డిపాజిట్లకు అమలు
- సీనియర్ సిటిజన్లకు అరశాతం అదనం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐ రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ ఈ రోజు నిర్ణయం వెలువరించింది. పలు కాల వ్యవధులపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరిగాయి. 7-45 రోజుల కాల వ్యవధి మధ్య ఉన్న డిపాజిట్లపై ప్రస్తుతం 5.25 శాతం వడ్డీ రేటు ఉండగా దీన్ని 5.75 శాతం చేసింది. ఏడాది కాల వ్యవధి కలిగిన డిపాజిట్ పై ఇప్పటి వరకు 6.25 శాతం వడ్డీ రేటు ఉండగా, డిపాజిట్ దారులు ఇకపై 6.40 శాతం పొందొచ్చు.
రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు కాల వ్యవధితో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇది 6 శాతమే. ఇక ఇదే కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు దాటిన వృద్ధులు) అర శాతం అదనంగా 7 శాతం మేర వడ్డీ రేటుకు అర్హులు. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది. తాజా రేట్లు కొత్తగా డిపాజిట్ చేసే వారికి, కాల వ్యవధి తీరి రెన్యువల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తాయని పేర్కొంది. కర్ణాటక బ్యాంకు, పీఎన్ బీ డిపాజిట్ రేట్లను ఇప్పటికే పెంచగా, ఎస్ బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటలో నడుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.