Chandrababu: మీలా 16 నెలలు జైల్లో కూర్చోలేదు.. సాక్షి పేపరు చూస్తేనే హృదయం భగ్గుమంటుంది: జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
- సాక్షిలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారు
- జగన్ వల్ల ఐఏఎస్ అధికారులు కూడా జైలుకు వెళ్లారు
- ప్రధాని మోదీకి కూడా నోటీసులు వచ్చాయి
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాలను మోసంగా పరిగణిస్తావా? అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలా ఇంట్లో కూర్చొని దొంగలెక్కలు రాయలేదని ధ్వజమెత్తారు. జగన్ కు రాజకీయ, పాలనానుభవం ఏమాత్రం లేదని అన్నారు. అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ అక్రమ సంపాదనకు దిగారని... ఆయన వల్ల ఐదుగురు ఐఏఎస్ అధికారులు సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారని, జైలు జీవితాన్ని అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లా తాను 16 నెలలు జైల్లో కూర్చోలేదని చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల ఏకంగా ప్రధాని మోదీకి మారిషస్ సంస్థ నోటీసులు జారీ చేసే పరిస్థితి దాపురించిందని అన్నారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
సరైన సంస్థలతో, వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఒప్పందాలను మాత్రమే సీఐఐ సదస్సులో చేసుకున్నామని చంద్రబాబు చెప్పారు. సమాచారాన్నంతటినీ ఆన్ లైన్లో ఉంచుతున్నామని తెలిపారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? అనే సమాచారమంతా ఆన్ లైన్ లో ఉంచుతామని చెప్పారు. పారదర్శకంగా ఒప్పందాలు చేసుకుంటే... ప్రభుత్వం మోసం చేస్తోందంటూ సాక్షి పత్రికలో రాయిస్తావా? అంటూ మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.