KTR: తెలంగాణను విస్మరించడం పట్ల కేటీఆర్‌ అసంతృప్తి... కేంద్ర రక్షణ శాఖ మంత్రికి లేఖ

  • తెలంగాణలో అన్ని విధాల అనువైన పరిస్థితులున్నాయి
  • అయినప్పటికీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఇవ్వలేదు
  • ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు తెలంగాణను తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి
  • ఈకో సిస్టమ్ ఉన్న చోట కారిడార్ కేటాయిస్తేనే మరిన్ని పెట్టుబడులు

తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ‌ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్ ఏర్పాటు చేయ‌డానికి తెలంగాణకు అన్ని రకాల అర్హతలున్నాయని, అలాగే తెలంగాణ స్థానిక యువతకు మరింత ఉపాధి లభిస్తుందని చెప్పారు. గత 5 దశాబ్దాలుగా అద్భుతమైన ఎయిరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఈకో సిస్టమ్ తెలంగాణలో ఉంద‌న్నారు.

ఈ మధ్య‌ బుందేల్ ఖండ్, చెన్నయ్- బెంగళూర్ ప్రాంతాలకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ఓ లేఖ రాశారు. ఈ బడ్జెట్ లో రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్లను ప్రకటించిన కేంద్రం, అన్ని విధాల అనువైన పరిస్థితులున్నప్పటికీ తెలంగాణను విస్మరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నూతన రాష్ట్రానికి ఈ కారిడార్లను కేటాయిస్తే ఇక్కడి యువతకు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉన్న ఎయిరో స్పేస్ డిఫెన్స్ అనూకూల వాతావరణాన్ని మంత్రి తన లేఖలో వివరించారు. ఈకో సిస్టమ్ ఉన్న చోట డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయిస్తేనే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. తెలంగాణ‌లో డీఅర్‌డీవో, ఆర్‌సీఐ, డీఆర్‌డీఎల్‌, బీడీఎల్‌, మిధాని, ఎన్‌సీఎల్ వంటి అనేక రక్షణ రంగ సంస్థలు ఉన్నాయని మంత్రి తన లేఖలో గుర్తు చేశారు.

దీంతోపాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, హెచ్‌బీఎల్, అస్ట్రా మొదలయిన ప్రయివేట్ రంగంలోనూ పలు సంస్థలు ఎయిరో స్పేస్, డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. అయా సంస్థలు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు భాగస్వామ్యంగా ఉన్నాయని, ఇలాంటి చోటనే డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి విమాన సౌకర్యం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, వరంగల్, బేగంపేట, దుండిగల్, హకీంపేటలో విమానాశ్రయ సదుపాయం ఉందన్నారు.

దీంతో పాటు ఇతర నగరాలకు లేని ఎనిమిది లేన్ల హైస్పీడ్ అవుటర్ రింగ్ రోడ్డు ఉందన్నారు. తెలంగాణకు ఉన్న మౌలిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఎయిరోస్సేస్ డిఫెన్స్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా పెట్టుకుందన్నారు. ఈ మేరకు ఆదిభట్ల, జీఎంఅర్ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న రెండు పార్కుల్లో ఇప్పటికే ఈ రెండు రంగాల్లో ఉత్పత్తులు కొనసాగుతున్నాయన్నారు. దీంతోపాటు ఎలిమినేడులో మరోపార్కు, మెదక్ లోని నిమ్జ్ లో ప్రత్యేకంగా మరో ఎయిరో స్పేస్ డిఫెన్స్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

దీంతోపాటు నగరంలో డిఫెన్స్ ఇంక్యూబేటర్ ఏర్పాటును సైతం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఇంతలా ప్రభుత్వ డిఫెన్స్ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన బోయింగ్, లాకీడ్ మార్టిన్, సికోర్స్కీ వంటి కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ తయారీ కేంద్రాలుగా ఎంచుకున్న విషయాన్ని తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ వంటి సంస్థలు తమ ఇంజిన్ శిక్షణ కేంద్రంగా నగరాన్ని ఎంపిక చేసుకున్నాయన్నారు. తెలంగాణలో 26 యూనివర్శిటీలు, 700లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, సుమారు 280 పాలిటెక్నిక్ కాలేజీలున్నాయని, వీటి ద్వారా ప్రతి ఏటా టెక్నికల్ పరిజ్ఞానం ఉన్న యువకులు బయటకు వస్తున్నారన్నారు.

నగరంలో కనీసం 1000 ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు డిఫెన్స్, ఎయిరో స్పేస్ రంగంలో పనిచేస్తున్నాయని, అనేక భారత రక్షణ, అంతరిక్ష కార్యక్రమాల్లో వీటికి భాగసామ్యం ఉందని, ఇలా అన్ని విధాలుగా తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించేందుకు అన్ని అర్హతలున్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కోరారు.

  • Loading...

More Telugu News