PNB: షాకింగ్! పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో రూ.1300 కోట్ల స్కాం.. బయటపెట్టిన బ్యాంకు!
- నీరవ్ మోదీ చేసిన అనధికారిక లావాదేవీలను గుర్తించిన పీఎన్‌బీ
- రూ.12,622 కోట్లకు చేరిన నీరవ్ మోదీ కుంభకోణం
- వెల్లడించిన ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో మరో కుంభకోణం జరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. ఇప్పటికే రూ.11300 కోట్లకు నీరవ్ మోదీ సదరు బ్యాంకును ముంచేసినట్టు తేలగా, ఆయన మరో రూ.1,322 కోట్ల మేర మోసం చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. నీరవ్ మోదీ, ఆయన అంకుల్, వ్యాపార భాగస్వామి అయిన మేహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను సోమవారం రాత్రి ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్ వెల్లడించింది.
నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీలు కలిసి 204 డాలర్ల విలువైన అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు తేలిదంటూ అంతకుముందు స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సమర్పించిన స్టేట్‌మెంట్‌లో పీఎన్‌బీ పేర్కొంది. బ్యాంకు కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చర్యలను వేగవంతం చేసింది. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.