Bhaichung Bhutia: మమతకు షాకిచ్చిన ఫుట్‌బాల్ మాజీ దిగ్గజం బైచుంగ్ భూటియా!
- తృణమూల్ కాంగ్రెస్‌కు భూటియా రాజీనామా
- భూటియా కోసం పోటీపడుతున్న సిక్కిం బీజేపీ, ఎస్‌కేఎం
- 2014, 2016 ఎన్నికల్లో ఓటమి పాలైన భూటియా
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు బైచుంగ్ భూటియా షాకిచ్చాడు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు. దేశంలోని ఏ పార్టీలోనూ తానిప్పుడు సభ్యుడిని కానని పేర్కొన్నాడు.
సిక్కింకు చెందిన భూటియా ఫుట్‌బాల్ క్రీడ నుంచి రిటైరైన రెండేళ్ల తర్వాత అంటే 2013లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ నుంచి బరిలోకి దిగి బీజేపీ నేత అహ్లూవాలియా చేతిలో ఓటమిపాలయ్యారు. 2016 ఎన్నికల్లో సిలిగురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీపీఎం అభ్యర్థి అశోక్ భట్టాచార్య చేతిలో ఓడిపోయారు. ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్న భూటియా గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
తృణమూల్ నుంచి బయటకు వచ్చిన అర్జున అవార్డు గ్రహీత అయిన భూటియా కోసం ఇప్పుడు బీజేపీ గాలం వేస్తోంది. తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. సిక్కింకు చెందిన భూటియా కోసం ఆ రాష్ట్ర బీజేపీ కమిటీ అధ్యక్షుడు డీబీ చౌహాన్ రంగంలోకి దిగారు. తాము జాతీయవాదులమని, సిక్కిం బీజేపీలో భూటియా భాగం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు సిక్కిం ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) కూడా భూటియాతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, భూటియా రాజీనామాపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించేందుకు నిరాకరించింది.