Mumbai: ముంబైలోని శ్రీదేవి నివాసంలో డాగ్‌స్క్వాడ్ తనిఖీలు?
- కలకలం రేపుతున్న డాగ్‌స్క్వాడ్ తనిఖీ వార్తలు
- దుబాయ్ పోలీసుల ఆదేశాలతోనే..
- శ్రీదేవికి కడసారి నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్న ముంబై
బాలీవుడ్ నట దిగ్గజం శ్రీదేవి మృతిపై సస్పెన్స్ కొనసాగుతుండగానే ముంబైలోని ఆమె ఇంట్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసినట్టు వచ్చిన వార్తలతో కలకలం రేగింది. శ్రీదేవి పార్థివ దేహం ఇంకా భారత్‌కు చేరుకోనేలేదు. ఈ సమయంలో ఆమె ఇంట్లో డాగ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ ఆరా తీస్తున్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు నిర్వహించారా? లేక, శ్రీదేవి మృతిపై క్షణక్షణానికి పెరుగుతున్న అనుమానాల నేపథ్యంలో ముంబై పోలీసులే ఈ తనిఖీలు నిర్వహించారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.
శ్రీదేవి పార్థివదేహం నేడు నగరానికి వస్తున్నట్టు తెలియడంతో తెలుగు, తమిళ చిత్రరంగాలకు చెందిన ప్రముఖులతోపాటు పలువురు ముంబై చేరుకున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీదేవి ఇంటి పరిసర ప్రాంతాలు జనసమ్మర్థంగా మారాయి.