Tamilnadu: విమానాశ్రయంలో ఎదురుపడ్డ పన్నీరు సెల్వం, దినకరన్.. దాడులు చేసుకున్న అనుచరులు!
- చెన్నై వెళ్లేందుకు మధురై విమానాశ్రయానికి చేరుకున్న పన్నీర్ సెల్వం, దినకరన్
- దినకరన్ మద్దతుదారులను దూషించిన పన్నీర్ మద్దతుదారులు
- పన్నీర్ మద్దతుదారులపై చెప్పు విసిరిన దినకరన్ మద్దతుదారు
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, శశికళ వర్గం నేత దినకరన్ లు మధురై విమానాశ్రయంలో ఒకరికొకరు ఎదురుపడ్డ సందర్భంగా అనుచరుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తమిళనాడులో కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... శ్రీవల్లిపుత్తూరులో జరుగనున్న తన మనుమడి చెవి కుట్టే కార్యక్రమానికి హాజరయ్యేందుకు పన్నీరు సెల్వం వెళ్తుండడంతో ఆయకు వీడ్కోలు పలికేందుకు పలువురు మద్దతుదారులు మధురై విమానాశ్రయానికి వచ్చారు.
అదే సమయంలో ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కూడా చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకున్నారు. పన్నీరు సెల్వం వచ్చిన విషయం తెలుసుకున్న దినకరన్ ముందు ఆయననే వెళ్లనివ్వమని విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అక్కడ దినకరన్ మద్దతుదారులను చూసిన పన్నీర్ మద్దతుదారులు వారిని దూషించడం మొదలెట్టారు. దీంతో దినకరన్ మద్దతుదారులు పన్నీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం దినకరన్ మద్దతుదారుడొకరు పన్నీర్ మద్దతుదారులపై చెప్పు విసిరాడు. దీంతో ఘర్షణ మొదలైంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన భద్రతా సిబ్బంది, పన్నీరు సెల్వంను విమానాశ్రయంలోకి తీసుకెళ్లారు, ఆ తరువాత దినకరన్ ను తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.