sridevi: జస్ట్ శ్రీదేవిని చూపిస్తే చాలన్నాడు.. రెండు లక్షలు ఇస్తానన్నాడు!: శ్రీదేవి క్రేజ్ గురించి చెప్పిన తమ్మారెడ్డి భరద్వాజ
- 1980 దశకంలో శ్రీదేవికి యువతలో విపరీతమైన క్రేజ్
- దుబాయ్ ఫ్రెండ్ ఒకడు శ్రీదేవిని చూపిస్తే 2 లక్షలు ఇస్తానన్నాడు
- పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నాడు
శ్రీదేవి ఆకస్మిక మృతి నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆమెతో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత తమారెడ్డి భరద్వాజ అప్పట్లో శ్రీదేవికి ఉన్న క్రేజ్ కి సంబంధించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... 1980 దశకంలో శ్రీదేవి అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉండేదని అన్నారు. తాను చదువు ముగించుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో దుబాయి నుంచి తన స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి, శ్రీదేవిని చూపిస్తే 2 లక్షల రూపాయలు ఇస్తానన్నాడని అన్నారు.
ఆమెను పరిచయం చేయాల్సిన అవసరం లేదని, షూటింగ్ లో ఆమెను జస్ట్ చూపిస్తే చాలని, తనకు అంతపెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లోనే అంత మొత్తం ఇస్తానన్నాడంటే ఆమెకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి, చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్'తో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారని ఆయన అన్నారు.
వర్ధమాన హీరోయిన్లు చాలా మంది ఆమెను అనుకరించే ప్రయత్నం చేస్తారని, కేవలం నటనలోనే కాకుండా క్రమశిక్షణ, ప్రొఫెషనలిజంలో కూడా ఆమెను అనుసరిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు.