'A Century Is Not Enough': 'దాదా... అర్ధరాత్రుల్లో సాహసాలు వద్దబ్బా'...గంగూలీకి పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ సలహా!

  • డిన్నర్ కోసం హోటల్ వెనుక ద్వారా నుంచి ఎస్కేప్
  • 2004లో పాకిస్థాన్‌లో వన్డే సిరీస్ సందర్భంగా ఘటన
  • ఆత్మకథ 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్'లో పేర్కొన్న బెంగాల్ టైగర్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 2004లో ఓ సలహా ఇచ్చారు. పాకిస్థాన్‌లో 'అర్ధరాత్రుల్లో సాహసాలు చేయొద్దు' అంటూ గంగూలీకి ఆయన సలహా ఇచ్చారట. ఆ దేశ క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బెంగాల్ టైగర్ తన ఆత్మకథ 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్'లో పేర్కొన్నారు.

వన్డే సిరీస్ కోసం వెళ్లిన గంగూలీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు లాహోర్‌లోని స్విష్ ఫెరల్ కాంటినెంటల్ హోటల్‌లో బసచేసింది. ఆ సిరీస్‌ను దాదా టీమ్ 3-2 తేడాతో గెల్చుకుంది. హోటల్ నుంచి సరదాగా బయటకు వెళ్లి మంచి ఫుడ్ ఐటెమ్స్ తినాలని టీమిండియా కోరుకుంది. కానీ, బయటకు వెళ్లాలని చెబితే సెక్యూరిటీ గార్డులు తనను అడ్డుకుంటారని భావించి, తన టీమ్ మేనేజర్ రత్నాకర్ షెట్టికి మాత్రమే ఈ సంగతి చెప్పానని గంగూలీ అన్నారు. సగం ముఖం కనిపించకుండా తలకు టోపీ ధరించి హోటల్ వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లానని, ఇలా చేయడం నిబంధనలను ఉల్లంఘించడమన్న సంగతి తనకు తెలుసునని ఆయన చెప్పారు.

"మేమంతా డిన్నర్ పూర్తి చేశాం. బయటకు రాగానే జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయి నన్ను గుర్తుపట్టేశారు. ఆయన నన్ను పిలవడం మొదలుపెట్టారు. దాంతో ఒక్కసారిగా జనాలు నా వైపుకు రావడం మొదలుపెట్టారు. ఇంకేముంది? ఈ వార్త అటూ ఇటూ తిరిగి దేశాధ్యక్షుడు ముషారఫ్ చెవికి చేరుకుంది" అని గంగూలీ చెప్పారు. ముషారఫ్ తనతో మర్యాదగానూ అదే సమయంలో చాలా కఠినంగానూ ఓ మాట చెప్పారు. "ఇంకోసారి మీరు బయటకు వెళ్లాలంటే దయచేసి సెక్యూరిటీకి చెప్పండి. మేమే మీ వెంట భద్రతా సిబ్బందిని పంపుతాం. కానీ, అర్ధరాత్రుల్లో మాత్రం ఇలాంటి సాహసాలు చేయొద్దు సుమా!" అని ఆయన తనతో చెప్పినట్లు గంగూలీ తెలిపారు.

'A Century Is Not Enough'
Pervez Musharraf
Sourav Ganguly
  • Loading...

More Telugu News