Asaduddin Owaisi: తీర్పు మాకు అనుకూలంగా వస్తే అక్కడే మసీదు నిర్మిస్తాం...!: అసదుద్దీన్ ఒవైసీ
- తీర్పు వాస్తవాల ఆధారంగానే ఉంటుందని భావిస్తున్నాం
- మసీదు డిమాండ్ ను ముస్లింలు వదిలిపెట్టరు
- రెండో తరగతి ప్రజలుగా ముస్లింలు
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వాస్తవాల ఆధారంగానే ఉంటుందన్న నమ్మకాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యక్తం చేశారు. అయోద్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ‘‘మా మసీదు అక్కడ ఉండేది. దేవుడి అనుగ్రహం ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే అదే స్థలంలో మరోసారి నిర్మిస్తాం. తీర్పు వాస్తవాల ఆధారంగానే ఉంటుంది. మత విశ్వాసాల ఆధారంగా కాదనే నమ్మకం ఉంది’’ అని ఒవైసీ చెప్పారు.
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలన్న డిమాండ్ ను ముస్లింలు వదిలిపెట్టరని ఒవైసీ స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నవారు, ఆ స్థలాన్ని విడిచి వెళ్లాలని మాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెబుతున్నది ఏమిటంటే, మేం మా మసీదును వదిలిపెట్టేది లేదు. మమ్మల్ని పాకిస్థానీ అని అనే వారిని ప్రశ్నించేది ఒక్కటే, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ ముస్లింలా? వారు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారు’’ అని ఒవైసీ అన్నారు. భారత్ లో ముస్లింలు రెండో రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆదేదన వ్యక్తం చేశారు.