Sridevi: శ్రీదేవి మరణంతో కన్నీరు పెడుతున్న సోషల్ మీడియా.. ఎవరెవరు ఏమన్నారంటే..
- శోకసంద్రంలో సినీ ప్రపంచం
- ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన ప్రముఖులు
- ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్లు
ప్రముఖ సినీనటి శ్రీదేవి మరణవార్తతో సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తొలుత ఆమె మరణవార్త సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పుకార్లంటూ అందరూ కొట్టిపడేశారు. అయితే, నిజమని తెలిశాక అభిమానులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మొత్తాన్ని ఆమె వార్తలు, జ్ఞాపకాలతో ముంచెత్తి నివాళులు అర్పించారు.
మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఆమె భర్త బోనీకపూర్, కుమార్తె ఖుషీ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు ఆమెతోనే ఉన్నారు.
శ్రీదేవి మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ట్విట్టర్ ద్వారా పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నామంటూ కొందరు కన్నీరు పెట్టుకున్నారు.
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తన సానుభూతిని తెలిపారు. తనకు ఎప్పుడూలేనంత అనీజీగా ఉందని పేర్కొన్నారు. తనకు మాటలు రావడం లేదని ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. ఇదో చీకటి రోజని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొంది. అనంతరం మరో ట్వీట్ చేస్తూ ‘లమ్హే’ సినిమాలోని పాప్యులర్ సాంగ్ ‘యె లమ్హె, యె పాల్ హమ్ హర్ పాల్ యాద్ కరేంగె..’ అనే పాటను పోస్టు చేసింది.
మరోనటి కరీనా కపూర్.. శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. శ్రీదేవి మరణంతో వ్యక్తిగతంతా తాను చాలా కోల్పోయానని రిచా చద్దా ట్వీట్ చేసింది. ఆమె మరణంతో వెండితెర మూగబోయిందని పేర్కొంది. ‘ఇంగ్లిష్-వింగ్లిష్’, ‘మామ్’ తర్వాత ఆమె నుంచి చాలా ఆశించానని, అంతలోనే ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
శ్రీదేవి మరణవార్త తెలిసి ఏడుపు ఆపుకోలేకపోతున్నానని సుమిత్రా సేన్ ట్వీట్ చేశారు. ‘మామ్’ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిద్ధార్థ మల్హోత్రా పేర్కొన్నాడు. శ్రీదేవి మరణం తన గుండెలు పిండేసిందని నేహ ధూపియా పేర్కొంది. విషయం తెలిసి తన గుండె బద్దలైందని, షాక్‌లోకి వెళ్లిపోయానని ప్రీతిజింతా పేర్కొంది. చిత్రపరిశ్రమలో ఐకాన్‌గా నిలిచిన శ్రీదేవి ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ట్వీట్ చేసింది. తనకు మాటలు రావడం లేదని అద్నాన్ సమీ పేర్కొన్నాడు. ఆమె దేశానికే స్వీట్ హార్ట్ అని, మానవతా విలువలు మెండుగా ఉన్న ఆమె త్వరగా వెళ్లిపోయారని పేర్కొన్నాడు.