Jagan: చంద్రబాబుని చూసి ఊసరవెల్లి కూడా భయపడుతుంది!: జగన్
- పదే పదే మాటలు మార్చుతున్నారు
- రాష్ట్రంలో ఆయన పాలన ఎలా ఉందో నాలుగేళ్లుగా చూస్తున్నారు
- మోసాలు, అసత్యాలతో కొనసాగుతోంది
- చంద్రబాబు హయాంలో దేశంలో ఎక్కడా లేని అవినీతి మన రాష్ట్రంలో జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే మాటలు మార్చుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుని చూసి ఊసరవెల్లి కూడా భయపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆయన పాలన ఎలా ఉందో నాలుగేళ్లుగా చూస్తున్నారని, మోసాలు, అసత్యాలతో కొనసాగుతోందని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో దేశంలో ఎక్కడా లేని అవినీతి మన రాష్ట్రంలో జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. విచ్చల విడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. 'ఎన్నికలకు ముందు మద్యం గురించి ఏమన్నారు? పిల్లలు మద్యం తాగి చెడిపోతున్నారని అన్నారు. బెల్టు షాపులు తొలగిస్తామని చెప్పారు.. గ్రామాల్లోనూ మద్యం దొరుకుతోంది... మంచి నీరు లేని గ్రామాలు ఉన్నాయేమోగానీ, మద్యం లేని గ్రామం మాత్రం లేదు. ఫోన్ చేస్తే చాలు, ఇంటికే మద్యం తీసుకొచ్చి ఇస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల రేట్లు పెరిగిపోయాయి. మహిళలకు రక్షణ కరవైంది. కరెంటు బిల్లు పెరిగిపోయింది. రేషన్ దుకాణాల్లోనూ సరుకులు సరిగా లభించడం లేదు. అప్పట్లో బియ్యంతో పాటు చాలా సరుకులు తక్కువ ధరలకే లభించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు' అని జగన్ అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అవి ఏవీ నెరవేర్చలేదని చెప్పారు.