President Donald Trump: తుపాకులున్న టీచర్లకు ట్రంప్ 'బోనస్' ఆఫర్..!
- ఒక్కో టీచర్‌కు రూ.67 వేల బోనస్‌కు యోచన
- ఫ్లోరిడా తరహా ఘటనలు తగ్గుతాయని ఆశ
- అసాల్ట్ రైఫిల్ కొనుగోలుదారుల వయసు పెంపుపై పరిశీలన
- నిధుల సమీకరణకు కాంగ్రెస్ సభ్యులతో చర్చించే చాన్స్
అమెరికా వ్యాప్తంగా ఇటీవల కాలంలో పాఠశాలలపై తుపాకీ కాల్పుల ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీచర్లకు తుపాకులిస్తే ఇలాంటి ఘటనలను అడ్డుకోవచ్చనే ఐడియాను తెరపైకి తెచ్చారు. ఆయన ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది టీచర్లకు ఆయుధాలు అందించి, వారికి తగు శిక్షణ ఇవ్వనుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమీకరించే అవకాశముందని ఆ వర్గాలు వెల్లడించాయి.
తుపాకులను కలిగి ఉన్న టీచర్లకు రూ.67 వేల చొప్పున బోనస్ ఇస్తే మొత్తం పది లక్షల మందికి రూ.6700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాయి. దీనికి సంబంధించి శాసన-బడ్జెట్ సంబంధిత ప్రతిపాదనపై కాంగ్రెస్ సభ్యులతో ట్రంప్ త్వరలోనే మాట్లాడుతారని తెలిపాయి. మరోవైపు అసాల్ట్ రైఫిల్ కొనుగోలుదారుల వయో పరిమితిని పెంచే ప్రతిపాదనను కూడా ట్రంప్ పరిశీలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
పాఠశాలల భధ్రతపై ఆయన తన కేబినెట్ సహచరులతో వైట్ హైస్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. టీచర్లకు తుపాకులు ఇవ్వడం వల్ల ఫ్లోరిడా స్కూల్ తరహా ఘటనలను తగ్గించవచ్చని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూళ్లలో తుపాకులు లేనందు వల్ల హంతకులు సులభంగా లోపలకి ప్రవేశించి నరమేధాలు సృష్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.