USCIS: హెచ్1బీ వీసాలు ఇక మరింత టఫ్.. నిబంధనలు కఠినతరం!
- హెచ్1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం
- భారత ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం
- ఏప్రిల్ 2 నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ!
హెచ్1బీ వీసాల ఆమోదం ఇంక అంత సులువు కాదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా పాలనా యంత్రాంగం ఈ వీసాల జారీకి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం భారత ఐటీ కంపెనీలపై, వాటి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది.
కొత్త విధానం కింద...ప్రతి కంపెనీ తన హెచ్1బీ ఉద్యోగికి సంబంధించి అదనపు వివరాలను ఆధారాలతో సమర్పించాల్సి ఉంటుంది. అంటే, ఉద్యోగులకు కేటాయించే వాస్తవికమైన పనికి సంబంధించిన పూర్తి ఆధారాలను అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగి నిర్వర్తించే బాధ్యతల సమగ్ర వివరాలు, అందుకు వారికి ఉన్న విద్యార్హతలు, ఉద్యోగ సమయం, వారికి చెల్లించే జీతం లేదా వేతనం, పని గంటలు, ప్రయోజనాలు, లబ్ధిదారుడి (ఉద్యోగి) పర్యవేక్షకుడి సమగ్ర వివరాలు, లబ్ధిదారుడు నిర్వర్తించే బాధ్యతలు లాంటి ఇతర సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది.
తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలను కోరుకునే కంపెనీలు తమ దరఖాస్తులను సమర్పించడానికి ముందే ఉద్యోగుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా హెచ్1బీ కార్యక్రమం కింద తాత్కాలిక అమెరికా వీసాలను మంజూరు చేస్తారు. ఈ వీసాల ద్వారా అర్హులైన అమెరికా నిపుణుల సంఖ్య తక్కువగా ఉన్న చోట అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలకు వీలవుతుంది.
భారత ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా అధికంగా ప్రయోజనం పొందుతున్న సంగతి విదితమే. కాగా, అక్టోబరు 1, 2018 నుంచి ప్రారంభమయ్యే 2019 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త వీసాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ ఏప్రిల్ 2 నుంచి మొదలవుతుందని అంచనా. అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 'బయ్ అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో పాటు అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల సంరక్షణలో భాగంగానే ఈ కొత్త పాలసీని రూపొందించారు.