Somu Veeraju: 'ఆస్కార్ అవార్డు' పొందిన కమలహాసన్ చంద్రబాబును పొగిడారట... నోరుజారి బుక్కైన బుద్ధా వెంకన్న!
- సోము వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు వెంకన్న ప్రెస్ మీట్
- పొరపాటున నోరు జారిన బుద్ధా వెంకన్న
- చంద్రబాబు ఇమేజ్ తో ఢిల్లీ పీఠం కదులుతోందని వ్యాఖ్య
- బీజేపీ నేతల పదవులన్నీ టీడీపీ చలవేనన్న వెంకన్న
ఈ ఉదయం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తున్న వేళ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా ముందు నోరు జారి బుక్కయ్యారు. కమలహాసన్ కు ఆస్కార్ అవార్డు వచ్చిందని ఆయన అనడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడు స్వయంగా కమలహాసన్ కు ఫోన్ చేసి రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ప్రజల్లోకి వెళ్లడంపై సలహా, సూచలను ఇవ్వగా, చంద్రబాబునాయుడే తన హీరో అని కమల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కమల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "భారతదేశం మొత్తంలో ఇమేజ్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు. అది పార్టీ వల్ల వచ్చింది కాదు. సాక్షాత్తూ ఆస్కార్ అవార్డులను పొందినటువంటి కమలహాసన్... నా హీరో చంద్రబాబునాయుడు అన్నారు. అంటే రియల్ హీరో. చంద్రబాబునాయుడు రియల్ హీరో అని కమల్ నోట్లోంచి వచ్చినటు వంటి పదం. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి" అని అన్నారు.
ఇవాళ చంద్రబాబునాయుడి ఒత్తిడితో ఢిల్లీ పీఠం కదిలే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ అటువంటిదని చెప్పారు. ఎంత ధైర్యం ఉంటే బీజేపీ వాళ్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ నాయకులకు ముఖ్యం కాదా? అని అడిగారు. బీజేపీ నేతలు పదవులే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నారని, ఆ పదవులు టీడీపీతో పొత్తు వల్లే వచ్చాయని మరిచారని ఎద్దేవా చేశారు.