Hyderabad: శాస్త్రీయ ఆధారాలు లేకుంటే వర్మపై కేసు నిలవదు: సీసీఎస్ వర్గాలు
- గత వారంలో వర్మను విచారించిన పోలీసులు
- కేసును నిలిపే ఆధారాల సేకరణలో సీసీఎస్
- పక్కా ఆధారాలు లేకుంటే ఏమీ చేయలేని స్థితి
- అదే పనిలో ఉన్నామంటున్న పోలీసు వర్గాలు
పోర్న్ చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్', ఆపై మహిళలపై చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మను విచారించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, ఆయనకు వ్యతిరేకంగా బలమైన శాస్త్రీయ ఆధారాలను సంపాదిస్తే తప్ప, పెట్టిన కేసు నిలవదన్న అభిప్రాయంలో ఉన్నారు. గతవారం జరిగిన విచారణలో భాగంగా జీఎస్టీ సినిమాకు తాను డైరెక్షన్ చేయలేదని, స్కైప్ ద్వారా కొన్ని సూచనలు మాత్రమే చేశానని వర్మ వాంగ్మూలం ఇవ్వగా, ఆయన ల్యాప్ టాప్ ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఉన్నట్టు ఆధారాల కోసం ల్యాప్ టాప్ ను సీజ్ చేసి విశ్లేషణకు పంపామని, అందులో ఆధారాలు లభిస్తే మాత్రమే ఆయనపై కేసు నిలుస్తుందని సీసీఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాము పక్కాగా ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నామని, అందువల్లే ఆయన నేడు విచారణకు రానవసరం లేదని కబురు చేశామని వెల్లడించాయి.