henric clasen: చాహల్ బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం: సఫారీ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్
- స్పిన్నర్ల బౌలింగ్ లోనే ఎక్కువ ఆడాను
- పేసర్లు స్వింగ్, లెగ్ కట్టర్లు, లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టడి చేస్తారు
- స్పిన్నర్లపై దాడికి దిగుతాను
అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా యువ సంచలనం యజువేంద్ర చాహల్ సంధిస్తున్న స్పిన్ ను అర్థం చేసుకోలేక బ్యాట్స్ మన్ బోల్తాకొడుతుంటే... సఫారీ టీ20 వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం అతని బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతున్నాడు. రెండో టీ20లో చాహల్ బౌలింగ్ పై దాడికి దిగిన క్లాసెన్ మాట్లాడుతూ, జాతీయ జట్టుకి ఎంపికవ్వకముందు తాను నాణ్యమైన లెగ్ స్పిన్నర్లను ఎదుర్కొన్నానని చెప్పాడు. షాన్ వోన్ బెర్గ్, టైటాన్స్ బౌలింగ్ ను ఎక్కువగా ఎదుర్కొని పరుగులు పిండుకునేవాడినని అన్నాడు.
అప్పుడు తనతో వారు మాట్లాడుతూ, లెగ్ స్పిన్నర్ల కెరీర్ కు నీ బ్యాటింగ్ తో ముగింపు పలుకుతావని జోక్ చేసేవారని క్లాసెన్ తెలిపాడు. కొన్ని సార్లు తనకు కూడా అలాగే అనిపిస్తుందని అన్నాడు. సీమర్లైతే లెగ్ కట్టర్లు, లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్ బంతులతో స్వేచ్చగా ఆడే వీలు లేకుండా చేస్తారని చెప్పాడు. అందుకే తాను లెగ్ స్పిన్నర్ల బౌలింగ్ లో దాడికి దిగుతానని క్లాసెన్ తెలిపాడు. చాహల్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్ (13వ ఓవర్) లో ఎక్కువ పరుగులు చేయొచ్చనిపించిందని చెప్పాడు. కాగా, ఆ ఓవర్ లో క్లాసెన్, డుమిని 23 పరుగులు చేయడం విశేషం.