ananda babau: ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష.. వివరాలు
- 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు
- 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- మార్చి 20 వరకూ దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 8న పరీక్ష, మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ
సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఇకపై ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ ఏప్రిల్ 8 వ తేదీన ఉమ్మడి పరీక్ష నిర్వహించి, ఆయా విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు.
అమరావతిలోని సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఉమ్మడి పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను మంత్రి నక్కా ఆనందబాబు ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంత వరకు సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ, ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ఇంగ్లిష్ మాధ్యమంలో ప్రవేశాలకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారని మంత్రి తెలిపారు.
ఆయా విద్యా సంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులు నాలుగు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేవారన్నారు. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యేవారన్నారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు... సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ, ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2018-19 నుంచి ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.
ఈ మేరకు ఏప్రిల్ 8 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నామన్నారు. జిల్లాను యూనిట్ గా తీసుకుని, ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా విద్యా సంస్థల్లో సీట్లు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. 4వ తరగతిలోని ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల నుంచి 10 ప్రశ్నల చొప్నున మల్టిపుల్ ఛాయిస్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపనున్నామన్నారు.
విద్యార్థులు 01.09.2018 నాటికి 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలని మంత్రి తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ ఉమ్మడి పరీక్ష జరగనుందన్నారు. గతేడాది ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విద్యాలయాల్లో 17 వేల సీట్లకు గానూ 54 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 14, 760 సీట్లు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 2,760, వెనుకబడిన తరగతులు సంక్షేమ పాఠశాలల్లో 3,400, ఏపీ గురుకుల విద్యాలయాల్లో 3,960 సీట్లు...మొత్తం 24,820 సీట్లకు గానూ లక్ష వరకూ దరఖాస్తులు రావచ్చని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 23వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు అందజేయాలని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూపొందించిన www.apgpcet.apcfss.in వెబ్ సైట్ ను మంత్రి నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నల్ వీరాములు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి దేవర వాసు తదితరులు పాల్గొన్నారు.