yogi adithyanath: మతకల్లోలాల కేసులో యోగి ఆదిత్యనాథ్ పాత్రపై పునర్విచారణకు హైకోర్టు తిరస్కరణ!
- 2007 జనవరి 27న ఇరు మతస్తుల మధ్య ఘర్షణ
- ఆ తర్వాత 15 రోజుల పాటు కొనసాగిన హింస
- యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమంటూ ఎఫ్ఐఆర్
2007లో గోరఖ్ పూర్ లో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత్రపై పునర్విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ అల్లర్లకు సంబంధించి సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే, 2007 జనవరి 27న రెండు మతస్తుల మధ్య జరిగిన గొడవల్లో ఓ హిందూ వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, ప్రతీకారం తీర్చుకోవాలంటూ యోగి ఆదిత్యనాథ్ (అప్పుడు ఎంపీగా ఉన్నారు) హిందువులను రెచ్చగొట్టారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు కల్పించుకున్న తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. యోగి ప్రసంగాలతో దాదాపు 15 రోజులపాటు అంతులేని హింస చెలరేగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తాను విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందని సీబీ సీఐడి ఇన్స్పెక్టర్ చంద్రభూషణ్ ఉపాధ్యాయ కోర్టుకి తెలిపారు.
ఈ నేపథ్యంలో, యోగి పాత్రపై పునర్విచారణ జరపాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.