Agra: హెల్మెట్ లేనివారికి జరిమానాల బదులు వింత శిక్ష విధిస్తున్న ఆగ్రా పోలీసులు!

  • అర కిలోమీటరు దూరం నడిపిస్తున్న పోలీసులు
  • ఈ వింత శిక్ష అవగాహన పెంచేందుకే
  • వెల్లడించిన ఆగ్రా పోలీసులు

హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపించడం నేరమని తెలిసినా, అది చాలా చిన్న నేరమేలే అన్నట్టు వాహనదారులు ప్రవర్తిస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. పోలీసుల తనిఖీల్లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే సాధారణంగా రూ. 100 నుంచి రూ. 200 వరకూ జరిమానా విధిస్తుంటారు. అయితే, జరిమానాలతో ప్రజల్లో చైతన్యం రావడం లేదని భావించిన ఆగ్రా పోలీసులు వింత శిక్ష విధిస్తున్నారు.

హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారిని అర కిలోమీటరు దూరం బైకును నడిపించాలని ఆదేశిస్తున్నారు. 500 మీటర్ల దూరాన్ని బైక్ ను నెట్టుకుంటూ వెళ్లడం వల్ల వారికి వ్యాయామంతో పాటు ఆ ఘటన గుర్తుండిపోతుందని, ఇకపై హెల్మెట్ ధరించాలన్న ఆలోచన కలుగుతోందని పోలీసులు అంటున్నారు.

ఇక ఇదే సమయంలో హెల్మెట్ తో వస్తేనే బండిలో పెట్రోలు పోయాలని కూడా వారు బంకుల యాజమాన్యాలను ఆదేశించారు. ఈ వాకింగ్ శిక్ష వాహనదారుల్లో ఎంతవరకూ చైతన్యాన్ని తెస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే, గత సంవత్సరం ఒక్క ఆగ్రాలోనే 1,062 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదయ్యాయి. దీంతో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ కొత్త ప్లాన్ వేశారు.

  • Loading...

More Telugu News