Palle Raghunath Reddy: పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ లో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వార్నింగ్... వీడియో హల్ చల్!
- పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన జేసీ
- వీడియో తీసిన ప్రభుత్వ ఉద్యోగి సురేష్ రెడ్డి
- మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
"నేను ఎవరి మాటా వినననే విషయం తెలుసు కదా? నేను ఇచ్చిన పనికి బిల్లును మంజూరు చేయాల్సిందే. ఇది పద్ధతి కాదు. ఇది మీకు తగదు" అంటూ తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ. 10 లక్షల సిమెంట్ రోడ్డు విషయమై వీరిద్దరి మధ్యా వాగ్వాదం రాగా, ఓ పీఆర్ ఉద్యోగి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది.
పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన ఓ రోడ్డు కాంట్రాక్టుపై వచ్చిన వివాదంలో ఇరువురు నేతలూ కల్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిమధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు స్పందించారు. వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలపై కొండసాని సురేష్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై కొత్త చెరువు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కొండసాని స్వయంగా వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.