PM Modi: ప్రధాని 'మన్ కీ బాత్'కి రాహుల్ ఇచ్చిన సలహాలివే..!
- నీరవ్ మోదీ, రాఫెల్ స్కాంలపై ప్రసంగించాలి
- మీరు చెబితే వినాలని ప్రజలు కోరుకుంటున్నారు
- ప్రధాని ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి
ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించాల్సిన అంశాలపై సలహాలివ్వండంటూ ప్రధాని సాధారణ ప్రజలను కోరడానికి బదులుగా దేశాన్ని కుదిపేసిన నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), రాఫెలె స్కాంల గురించి మాట్లాడవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు.
"మోదీగారు... గతనెల మన్ కీ బాత్ కార్యక్రమానికి నా సలహాలను మీరు పట్టించుకోలేదు. ప్రజల నుండి సలహాలు కోరడమెందుకు? ప్రతి భారత పౌరుడు మీ నోటి నుండి ఏమి వినాలనుకుంటున్నారో మీ మనసుకు తెలియదా?" అని రాహుల్ చురకలు అంటించారు.
నీరవ్ మోదీ రూ.22 వేల కోట్ల మోసం, రూ.58 వేల కోట్ల రాఫెల్ స్కాంల గురించి ప్రధాని మాట్లాడాలని, తమ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ స్కాంపై ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని రాహుల్ గతంలోనే ప్రశ్నించారు. ఈ మోసంలో ఉన్నతస్థాయి అధికారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.