North Western railways: ఆ రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళా ఉద్యోగులే!
- ఉత్తరాదిలో తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా గాంధీనగర్ స్టేషన్
- పోర్టర్ మొదలుకుని స్టేషన్ మాస్టర్ వరకు అందరూ మహిళలే
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది అందరూ మహిళలే. ఈ రకంగా ఈ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. నార్త్ వెస్టర్న్ రైల్వేస్ (ఎన్‌డబ్ల్యూఆర్) సరికొత్తగా ఆలోచించి ఈ మేరకు స్టేషన్‌లో పోర్టర్ మొదలుకుని (స్టేషన్) మాస్టర్ వరకు అంతా మహిళలనే నియమించింది. ఇలా ఈ స్టేషన్‌లో పనిచేస్తున్న మొత్తం 32 మందీ మహిళలే. ఈ స్టేషన్‌లో రోజుకు దాదాపు 7 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. యాభై రైళ్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తాయి. వాటిలో 25 రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
స్టేషన్ మాస్టర్‌గా తనకు దక్కిన అవకాశానికి ఏంజెలా స్టెల్లా ఉబ్బితబ్బిబవుతున్నారు. రైల్వే స్టేషన్‌కి మాస్టర్‌గా తనకు లభించిన ఈ కొత్త బాధ్యత పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు స్టేషన్ భద్రతకు, ఇతర విషయాల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తానని ఆమె చెప్పారు. సోమవారం జరిగిన స్టేషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్‌డబ్ల్యూఆర్ జనరల్ మేనేజర్ టీపీ సింగ్ పాల్గొన్నారు. పురుషులతో తామూ సమానమని మహిళలు ఎల్లప్పుడూ నిరూపించుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ముంబైలోని మాతుంగ రైల్వే స్టేషన్‌ని కూడా మొత్తం మహిళా సిబ్బందే నిర్వహిస్తున్నప్పటికీ, అది సబ్ అర్బన్ కేటగిరీలోకి వస్తుందని, తమది మాత్రం ప్రధాన కేటగిరీలోకి వస్తుందని ఆయన చెప్పారు.