Congress: రాహుల్ గాంధీని కలిసిన నాగం జనార్దన్ రెడ్డి... ఇక కాంగ్రెస్ లో ప్రయాణం!
- ఉత్తమ్ తో కలసి రాహుల్ తో చర్చలు
- నాగం చేరికను స్వాగతించిన కాంగ్రెస్ అధ్యక్షుడు
- ఆయన వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం
ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరి, అక్కడా ఇమడలేకపోయిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రాహుల్ గాంధీని కలసి వచ్చారని, నాగం చేరికను రాహుల్ సైతం స్వాగతించారని తెలుస్తోంది.
ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా పొందిన నాగం, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారన్న సంగతి తెలిసిందే. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్రను ఆయన సొంతం చేసుకున్నారు. మంత్రిగానూ విధులు నిర్వహించారు. 2013లో ఆయన బీజేపీలో చేరారు. ఇక నాగం కాంగ్రెస్ లో చేరికతో మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.