Telugudesam: విభజన చట్టంలోని పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ తగదు!: కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు
- కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి అన్యాయం చేసింది
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేది
- టీడీపీ, వైసీపీలు పరస్పర విమర్శలు చేసుకోవడమే సరిపోతోంది
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్లంరాజు డిమాండ్ చేశారు. విజయవాడలోని కాంగ్రెెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆంధ్రుల ఆత్మగౌరవదీక్ష’ లు నిర్వహిస్తున్నామని, మార్చి 2వ తేదీన ఏపీలో రాస్తోరోకో, మార్చి 6,7,8 తేదీల్లో ఢిల్లీలో ‘ఛలో పార్లమెంట్’ పేరిట నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు చెప్పారు.
విభజన చట్టంలోని పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోందని, కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపైనా ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం లేదని, కేవలం, అమరావతి రాజధాని గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ గానీ, వైసీపీ గానీ కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలనే విషయంలో స్పష్టంగా వ్యవహరించట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మీరు పెట్టండి అంటే, మీరు పెట్టండి’ అంటూ వైసీపీ, టీడీపీలు పరస్పర ప్రకటనలు చేసుకోవడమే సరిపోతోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని పల్లంరాజు అన్నారు.