Nithya Menen: 'బసవతారకం' రోల్‌పై క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్!

  • ఎన్‌టీఆర్ బయోపిక్‌లో నటించడం లేదని స్పష్టీకరణ
  • కారణాలను దర్శకనిర్మాతలకు చెప్పానని వెల్లడి
  • సొంత దర్శకత్వంలో సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీ

నటనతో పాటు డబ్బింగ్, సింగింగ్ పరంగానూ గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యా మీనన్. తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై చాలా ఏళ్లయినా ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు చాలా తక్కువే. నితిన్‌తో చేసిన 'ఇష్క్' చిత్రంతో ఆమెకు మాంచి క్రేజ్ వచ్చింది. కానీ పాత్రల సెలక్షన్ విషయంలో మాత్రం రాజీపడనని, పాత్ర చిన్నదైనా సరే తనకు గుర్తింపు వచ్చేదైతేనే చేస్తానని ఆమె చాలా సందర్భాల్లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. చూడ్డానికి క్యూట్‌గా, సెన్సిటివ్‌గా కనిపించినా పాత్రల ఎంపిక విషయంలో మాత్రం ఆమె 'నో కాంప్రమైజ్' సూత్రాన్నే ఫాలో అవుతోంది. తాజాగా దివంగత మహా నటుడు ఎన్‌టీ రామారావు జీవితంపై దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలో తనకు వచ్చిన ఓ బంపర్ ఆఫర్‌కు ఆమె మరో మాట లేకుండా నో చెప్పేసింది.

రామారావు సతీమణి బసవతారకం పాత్రను పోషించడానికి ఆమెకు ఆఫర్ వచ్చిందట. ఆ పాత్ర కోసం తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని, కానీ దానిని తిరస్కరించానని, కారణాలను కూడా వారికి చెప్పానని ఈ ముద్దుగుమ్మ స్వయంగా తెలిపింది. హీరో నాని నిర్మాణంలో ఇటీవల రిలీజైన 'అ' చిత్రం తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. మరోవైపు మెగాఫోన్ పట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు ఈ కేరళ కుట్టి చెప్పుకొస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నానంటోంది. ఇప్పటికే నటిగా, గాయనిగా నిరూపించుకున్న నిత్య దర్శకురాలిగా కూడా రాణించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటుందేమో చూద్దాం.

Nithya Menen
Basavatarakam
NTR
Teja
  • Loading...

More Telugu News