Chandrababu: జగన్నాటకానికి కారణం ఇదే!: చంద్రబాబు

  • రాష్ట్రం అభివృద్ధి కావద్దనేదే అసలైన కారణం
  • ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సినవి అడగాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది
  • కాంగ్రెస్ నేతలది డబుల్ గేమ్

వైసీపీ అధినేత జగన్, ఏపీ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కాకూడదనేదే జగన్నాటకం వెనకున్న అసలైన కారణమని ఆయన మండిపడ్డారు. గత మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నా... ఇతర రాష్ట్రాల కన్నా గొప్పగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.

ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపరాదని చెప్పారు. ఈ రోజు విజయవాడలో తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు మండిపడ్డారు.

 రాష్ట్రానికి అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అంటూ బీజేపీ నేతలు ప్రకటనలు మొదలు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడగాల్సిన బీజేపీ నేతలు... టీడీపీనే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే... ఆయన నిరసనకు, తమకు సంబంధం లేదని గులాం నబీ ఆజాద్ అన్నారని... ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి, కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే... అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.  

Chandrababu
Jagan
cogress
Telugudesam
BJP
  • Loading...

More Telugu News