kp oli: మాకు ఇద్దరు పొరుగు వారున్నారు... ఒక్కరిపైనే ఆధారపడదలుచుకోలేదు: నేపాల్ కొత్త ప్రధాని
- భారత్ తో గొప్ప సంబంధాలు
- వీటిని ఇంకా మెరుగుపరుచుకుంటాం
- ఒకరి సౌర్వభౌమాధికారాన్ని మరొకరం గౌరవించుకుంటాం
నేపాల్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కేపీ ఓలి చైనాతో సంబంధాల విస్తృతికి ఆసక్తి వ్యక్తం చేశారు. చైనా అనుకూల వాదిగా ముద్ర పడిన ఓలి భారత్ తోనూ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. భారత్-నేపాల్ సరిహద్దు సంబంధాలపై నిబంధనల సమీక్షకు కూడా అనుకూలమేనని ప్రకటించారు.
‘‘భారత్ తో నేపాల్ కు గొప్ప అనుసంధానత ఉంది. సరిహద్దులు తెరిచి ఉంటాయి. అంతా మంచిదే. ఈ అనుసంధానతను మరింత పెంచుకుంటాం. అదే సమయంలో మాకు రెండు పొరుగు దేశాలు ఉన్నాయన్న అంశాన్ని విస్మరించం. ఒకే దేశంపై మేము ఆధారపడాలనుకోవడం లేదు’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
భారత్ తో సంబంధాలపై మీ ప్రణాళికలు ఏంటన్న ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘భారత్ తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. భారత్ లోని కొన్ని శక్తులు అపార్థాలకు కారణమవుతున్నాయి. అయితే, భవిష్యత్తులో తమ జోక్యం ఉండబోదని భారత నేతలు హామీ ఇచ్చారు. ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరం గౌరవించుకుంటాం’’ అని ఓలి తెలిపారు.