Pawan Kalyan: చెప్పింది పవన్ కల్యాణ్ కాబట్టే ఈ మాత్రం స్పందన: ఉండవల్లి అరుణ్ కుమార్
- 'అవిశ్వాసం' అన్న మాట తొలుత చెప్పింది పవన్ కల్యాణే
- అందుకే అంత కవరేజ్ వచ్చింది
- టీడీపీ, బీజేపీ పధ్ధతి మార్చుకోవాలి
- జేఎఫ్సీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఒత్తిడి పెరుగుతుందని పవన్ కల్యాణ్ వంటి సెలబ్రిటీ చెప్పబట్టే ఈ మాత్రం స్పందన వచ్చిందని, లేకుంటే రాజకీయ నేతలు నరేంద్ర మోదీపై భయంతో రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టిని పెట్టేవారు కాదని జేఎఫ్సీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రంపై జగన్ పెడతానన్న అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
జగన్ అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలకాలని డిమాండ్ చేసిన ఉండవల్లి, అవిశ్వాసం అన్న పదం పవన్ నుంచి రాబట్టే, మీడియాలో ఇంత కవరేజ్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. జగన్ తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించి ప్రభుత్వాన్ని నిలదీయాలని సలహా ఇచ్చిన ఉండవల్లి, ప్రభుత్వం నుంచి నిజానిజాలను రాబట్టే ప్రయత్నాన్ని వైసీపీ చేయాలని సూచించారు. భాగస్వామ్య ప్రభుత్వాలు రోడ్డెక్కి కొట్టుకోవడం అభివృద్ధి విఘాతమని, బీజేపీ, టీడీపీలు తమ వైఖరిని మార్చుకోవాలని ఉండవల్లి కోరారు.