Pakistan: చైనా భాషను అధికారిక భాషగా ప్రకటించిన పాకిస్థాన్!
- మాండరీన్ ను అధికారిక భాషగా గుర్తించిన పాకిస్థాన్
- బంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యం
- పాక్ లో అధికారిక భాషలు: ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్, మాండరీన్
చైనాతో బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా పాకిస్థాన్ మరో ముందడుగు వేసింది. చైనా భాష మాండరీన్ ను అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించింది. పాక్ గడ్డపై భారీ బడ్జెట్ తో చైనా చేపట్టిన 'చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్'కు సంబంధించి భాష సమస్య లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా అమెరికాలో పాకిస్థాన్ రాయబారి అయిన హుస్సేన్ హక్కానీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, '70 ఏళ్ల పాక్ చరిత్రలో ఎక్కువ మంది ప్రజల మాతృభాష కానటువంటి ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్, చైనీస్ భాషలను అధికారిక భాషలుగా గుర్తించారు. స్థానిక భాషలను పట్టించుకోలేదు' అని అసహనం వ్యక్తం చేశారు. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువ మంది పంజాబీనే మాట్లాడతారు. ఇదే విధంగా పష్తో భాషతో పాటు ఇతర అనేక స్థానిక భాషలు పాక్ లో ఉన్నాయి.
మరోవైపు, మాండరీన్ ను నేర్చుకోవడానికి పాకిస్థానీలు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో చైనా పెట్టుబడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, మాండరీన్ నేర్చుకుంటే ఉద్యోగాలు ఎక్కువగా దొరుకుతాయనే భావన చాలా మందిలో నెలకొంది. 'ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా' నుంచి 500 మిలియన్ డాలర్ల లోన్ వచ్చిన మూడు రోజుల్లోనే మాండరీన్ ను అధికారిక భాషగా గుర్తించే ప్రయత్నం జరగడం గమనార్హం.