Vizag: పాప ప్రాణాలు పోతున్నాయని ఎంతగా మొత్తుకున్నా స్పందించని ఇండియన్ రైల్వేస్!
- ఇంకా మారని భారతీయ రైల్వేలు
- పాప పల్స్ పడిపోయిందన్నా స్పందించని అధికారులు
- రైల్వే మంత్రి నుంచి చంద్రబాబునాయుడు వరకూ పలువురికి ట్యాగ్
- సకాలంలో చికిత్స అందక చిన్నారి మృతి
- వెల్లువెత్తుతున్న విమర్శలు
సోషల్ మీడియా విప్లవం వచ్చిన తరువాత భారతీయ రైల్వేలు ఎంతో మారాయని భావిస్తున్నారా? అదంతా అవాస్తవమని చెబుతోందీ ఘటన. తనకు ఆహారం కావాలని, మంచి నీరు కావాలని, టాయిలెట్లు బాగాలేవని ప్రయాణికులు ట్విట్టర్ ఖాతా ద్వారా కోరితే, రైల్వే మంత్రి నుంచి అధికారుల వరకూ ఆగమేఘాల మీద స్పందించి, ప్రయాణికుల అవసరాలు తీర్చి పతాక శీర్షికల్లోకి ఎక్కి, రైల్వేలు మారాయని చాటింపు వేయించుకున్నారు. అదే ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉందని గంటల తరబడి మొత్తుకున్నా వీసమెత్తు సాయం చేయకుండా, చిన్నారి మృతికి కారణమయ్యారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, గత రాత్రి యశ్వంత్ పూర్ నుంచి పూరీ వెళుతున్న గరీభ్ రథ్ (రైలు నంబర్ 22884)లో జీ5 కోచ్, బెర్త్ నంబర్ 33లో ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తోంది. ఆ పాపకు గుండె సమస్య ఉంది. పాప పల్స్ ఆగిపోయినట్టు గమనించిన తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్నవారికి సమాచారం ఇచ్చారు. లైల్లోనే ఉన్న సన్నీ దినకర్ అనే యువకుడు, రైల్వే మంత్రి పీయుష్ గోయల్, ఆయన కార్యాలయం, ప్రధాని కార్యాలయం, రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయం, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ పాపను కాపాడాలని పలుమార్లు వేడుకున్నాడు.
రైలు కాసేపట్లో వైజాగ్ కు చేరుతుందని, వైద్య బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశాడు. ఆపై రైలు వైజాగ్ చేరిన తరువాత కూడా వైద్యులను పంపాలని కోరాడు. ఎవరూ రాకపోగా, పాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి. తాను ట్యాగ్ చేసిన వారిలో ఏ ఒక్కరు స్పందించినా, పాప ప్రాణాలు దక్కేవని సన్నీ వ్యాఖ్యానించగా, అధికారుల వైఖరిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విషయం తమకు తెలిసిందని, విశాఖలోనే వైద్యబృందాన్ని ఏర్పాటు చేశామని, వారు పాపను పరీక్షించి అప్పటికే ప్రాణాలు పోయాయని స్పష్టం చేశారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యమూ లేదని వాల్తేరు రైల్వే అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.