Nirav Modi: నీరవ్‌కు రెండు దేశాల్లో పౌరసత్వం?

  • నీరవ్‌కు బ్రెజిల్ పౌరసత్వం కూడా ఉన్నట్లు డౌట్
  • తాను భారత పౌరుడినేనని నీరవ్ మోదీ ప్రకటన
  • ఆయన గురించి పలాన్‌పూరి జైన్ వర్గానికి బాగా తెలుసు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను దాదాపు రూ.11300 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి రెండు దేశాల్లో పౌరసత్వం ఉన్నట్లు ఇదే వ్యాపారంతో సంబంధమున్న పలువురు చెబుతున్నారు. మోదీ తన సోదరుడు నిషాల్ మాదిరిగానే చాలాకాలంగా బెల్జియం పౌరసత్వం కల్గి ఉన్నారు. అయితే నిషాల్ తన ఇండియన్ పాస్ పోర్టును తిరిగిచ్చేసి, బెల్జియం పౌరసత్వం పొందినట్లు తెలిసింది. కానీ, నీరవ్ మోదీ మాత్రం తాను భారత పౌరుడినేనని ప్రకటించినట్లు సమాచారం. భారతదేశ వజ్రాల వ్యాపారంలో ఆధిపత్యం కలిగి ఉన్న పలాన్‌పూరి జైన్ వర్గానికి నీరవ్‌ ద్వంద్వ పౌరసత్వం గురించి బాగా తెలుసునని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు నీరవ్ మోదీ భార్య అమీ అమెరికా పౌరురాలు. ఇక నిషాల్ భార్య ఇషిత గోవా గనుల వ్యాపారి దత్తరాజ్ సాల్గావోకర్ కుమార్తె. అంతేకాక రిలయన్స్ సంస్థల అధినేత దివంగత ధీరూభాయ్ అంబానీ మనుమరాలు కూడా కావడం గమనార్హం. మోదీ సోదరులు వారి కుటుంబాలు ఈ జనవరిలోనే భారత్‌ను విడిచి పారిపోయాయి. నీరవ్ మామ మెహుల్ చోక్సీ కూడా అప్పటి నుండే కనిపించకపోవడంతో పీఎన్‌బీ మోసానికి సంబంధించి అనేక అనుమానాలకు ఆస్కారం కల్గుతోంది. భారత్‌లో ఒకవైపు పీఎన్‌బీ వ్యవహారం కుదిపేస్తుంటే నీరవ్ మోదీ మాత్రం తొలుత స్విట్జర్లాండ్‌లోనూ తర్వాత న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో జల్సా చేస్తూ కనిపించినట్లు సమాచారం. కాగా, ఈడీ సలహా మేరకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పాస్ పోర్టులను భారత విదేశాంగ శాఖ నాలుగు వారాల పాటు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News