Uttar Pradesh: చావు భయంతో జైళ్లకు క్యూకడుతున్న నేరస్తులు.. యూపీలో వింత పరిస్థితి!
- ఎన్‌కౌంటర్ల భయంతో స్వచ్ఛందంగా లొంగిపోతున్న నేరస్తులు
- యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,240 ఎన్‌కౌంటర్లు
- 40 మంది హతం, 305 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దెబ్బకు రాష్ట్రంలోని గూండాలు జైళ్లకు క్యూకడుతున్నారు. ఫలితంగా జైళ్లన్నీ ఇప్పుడు వారితో నిండిపోతున్నాయి. గూండాలను అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు బాసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో నేరస్తులు ఇలా తమంత తాముగా పోలీసులకు లొంగిపోతున్నారు. గతేడాది యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తం 1,240 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 40 మంది నేరస్తులు హతమవగా 305 మంది గాయపడ్డారు.
నేరస్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలకు పూనుకుంది. మార్చి 20, 2017న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా, 14, ఫిబ్రవరి వరకు మొత్తం 2,956 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులకు చెందిన రూ.147 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.
యూపీ డీజీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ తలలపై రివార్డులున్న 142 మంది నేరస్తులు లొంగిపోయారు. వీరిలో 26 మంది నేరస్తులు బెయిలు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టలేక జైళ్లలోనే ఉండగా, 71 మంది నేరగాళ్ల బెయిల్ బాండ్స్ రద్దయ్యాయి. ఫలితంగా వారు తిరిగి జైలుకు వెళ్లారు. ‘‘క్రిమినల్స్ మళ్లీ జైళ్లకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరిని తాము అడ్డుకోవడం లేదని, ఎందుకంటే వారు లోపల ఉండడమే కరెక్టని యూపీ డీజీపీ ఓపీ సింగ్ పేర్కొన్నారు. నేరస్తులపై తీసుకుంటున్న చర్యలకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.