LoU: బాకీల చెల్లింపుకు పీఎన్‌బీకి డెడ్‌లైన్.. మార్చిలోగా చెల్లించాలని ఆదేశం!
- అంతర్గత వనరుల ద్వారా డబ్బు సమీకరించనున్న బ్యాంకు
- ఈ స్కాంలో ఇప్పటివరకు పదిమంది ఉద్యోగుల సస్పెన్షన్
- నీరవ్ మోదీ కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ
దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని షాక్‌కు గురిచేసిన దాదాపు రూ.11,300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి ఇతర బ్యాంకుల బాకీలను పీఎన్‌బీ మార్చి 31లోగా చెల్లిస్తుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. చెల్లింపుల కోసం అంతర్గత వనరుల ద్వారా పీఎన్‌బీ డబ్బును సమకూర్చుకోనుందని ఆయన చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది పీఎన్‌బీ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ మోసంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్‌బీ లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూలు)లను ఉపయోగించి, ఇతర బ్యాంకుల నుండి రుణాలు పొందారు.
ఈ కేసును ప్రస్తుతం సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న నీరవ్ కోసం అంతర్జాతీయ పోలీసు వ్యవస్థ 'ఇంటర్ పోల్' రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతేకాక నీరవ్ తన వ్యాపార భాగస్వామి మేహుల్ పాస్ పోర్టులను కూడా విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ ఉద్యోగుల్లో పీఎన్‌బీ తాజాగా మరో ఎనిమిది మందిని సస్పెండ్ చేసింది. తద్వారా ఇప్పటివరకు సస్పెండ్ అయిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 18కి చేరుకుంది.