RGV: రామ్ గోపాల్ వర్మది మామూలు కేసు కాదు.. రుజువైతే ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది!: సైబర్ క్రైమ్ డీసీపీ
- దోషిగా తేలితే రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం
- టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించాలి
- మరింత లోతుగా విచారించేందుకే మరో నోటీసు ఇచ్చాం
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును ఆషామాషీగా విచారించలేమని, టెక్నికల్ గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి కేసుల్లో 50 శాతం రుజువయ్యాయని చెప్పారు. విచారణకు వర్మ పూర్తిగా సహకరించారని తెలిపారు. ఆయనను అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కేసును మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఆయనకు మరో నోటీసు ఇచ్చామని అన్నారు. విచారణను పూర్తి చేయడానికి సమయం పడుతుందని వివరించారు. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వర్మ అనేక లింక్స్ పెట్టారని చెబుతున్నారని... ఈ లింక్స్ ను పరిశీలిస్తామని, లింక్స్ అందుకున్న వారి నుంచి సమాచారం సేకరిస్తామని, ఆ లింక్స్ వర్మ అఫీషియల్ పేజ్ నుంచి వెళ్లాయో లేదో పరిశీలిస్తామని చెప్పారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారుతాయని తెలిపారు.