devi: రామ్ గోపాల్‌ వర్మ కేసును సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరాం: సామాజిక కార్యకర్త దేవి

  • మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌యం
  • క‌నీసం ఛార్జిషీటు ప‌డేవర‌కు ఏమీ చెప్ప‌లేము
  • ప‌వ‌ర్ ఫుల్ లాయ‌ర్ల‌ను పెట్టుకుంటారు
  • వర్మకు శిక్ష ప‌డుతుందా? లేదా? అనేది చెప్పలేము

జీఎస్టీ షార్ట్‌ఫిల్మ్‌, మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన కేసులో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఈ రోజు హైద‌రాబాద్‌లో పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయనపై కేసు వేసిన సామాజిక కార్యకర్త దేవి ఈ విషయంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఇది తాను ఒక్కదాన్నే వేసిన కేసు కాదని, మ‌హిళా సంఘాలు వేసిన కేసని అన్నారు. ఇది మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌యమని, ఈ కేసును సీరియ‌స్ గా తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరామని అన్నారు.

నేరం జ‌రిగింద‌ని విచార‌ణ‌లో తేలితే ఆ నేరం ఏ స్థాయిలో జ‌రిగితే అందుకు త‌గ్గ శిక్ష ప‌డేలా చేస్తామ‌ని పోలీసులు హామీ ఇచ్చారని దేవి తెలిపారు. అయితే, చ‌ట్టాల్లో చాలా తిక‌మ‌క‌లుంటాయని, దానికితోడు ఐటీ యాక్ట్ మ‌రింత తిక‌మ‌క‌గా ఉంటుందని అన్నారు. క‌నీసం ఛార్జిషీటు ప‌డేవర‌కు ఏమీ చెప్ప‌లేమని వ్యాఖ్యానించారు. డబ్బున్న వారు ప‌వ‌ర్ ఫుల్ లాయ‌ర్ల‌ను పెట్టుకుంటారని, చ‌ట్టంలోని లొసుగుల‌ను ఉప‌యోగించుకుంటారని అన్నారు.

శిక్ష ప‌డుతుందా? లేదా? అనేది చెప్ప‌లేమ‌ని, అయితే పోలీసుల మీద త‌మ‌కు న‌మ్మకం ఉందని దేవి అన్నారు. వ‌ర్మ‌ను తీసుకొచ్చి ఇంత‌సేపు విచారిస్తార‌ని అనుకోలేదని, కానీ పోలీసులు విచారించి, సాక్ష్యాధారాల‌ను ప‌రిశీలిస్తున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News