Andhra Pradesh: హామీలకు మోదీ కట్టుబడి ఉండాలి.. కేంద్రమిచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: గంటా శ్రీనివాసరావు ప్రకటన

  • హరిబాబు గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెప్పారు
  • ఢిల్లీకన్నా గొప్ప రాజధానిని నిర్మిస్తామని మోదీ అన్నారు
  • మేము అదనంగా కోరడంలేదు
  • పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలి

నేటి వరకు రాష్ట్రానికి కేంద్రమిచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రమిచ్చిన నిధులపై బీజేపీ నేతలతో ఎక్కడయినా, ఎప్పుడయినా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావుతో కలిసి ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు ఢిల్లీలో తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గతంలో తాను ప్రకటించిన వివరాలనే మళ్లీ తెలిపారని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తిరుపతి ఎన్నికల బహిరంగ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఆ హామీకి ప్రధాన మంత్రి కట్టుబడి ఉండాలని మంత్రి కోరారు. హామీల్లో చెప్పిన ఏడు ఇన్‌స్టిట్యూట్‌లకు గానూ అయిదు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. వాటి తరగతులు సొంత భవనాల్లో జరగడం లేదన్నారు. కర్నూలుకు కేటాయించిన IIIT తరగతులను తమిళనాడులోని కాంచీపురంలో నిర్వహిస్తున్నారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్శిటీకి ఇంత వరకూ కేంద్ర మంత్రి మండలి ఆమోదమే తెలపలేదన్నారు.

ఏడు ఇన్‌స్టిట్యూట్‌లకు 2015-16లో రూ.103 కోట్లు, 2016-17లో రూ.158 కోట్లు, 17-18లో రూ.260 కోట్లు, రాబోయే 18-19 బడ్జెట్ లో రూ.245 కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే 2,401 ఎకరాలు కేటాయించిందన్నారు.

అదే సమయంలో ఈ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.72 కోట్ల వరకూ వెచ్చించిందన్నారు. ఏపీకి ఎయిర్ పోర్టు, దూరదర్శన్, పాస్ పోర్టు కేంద్రాలు ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారని, ఏ రాష్ట్రానికయినా దూరదర్శన్, పాస్ పోర్టు కార్యాయాలు మంజూరు చేయడం సాధారణ విషయమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రమిచ్చిన నిధులపై ఎక్కడయినా, ఎప్పుడయినా బీజేపీ నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

నేటి వరకూ రాష్ట్రానికి కేంద్రమిచ్చిన నిధులపై త్వరలో 4, 5 శ్వేతపత్రాలు ఇచ్చే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మిత్ర పక్షంగా గుర్తించి, తమకు అధిక సాయం చేయాలని ఆయన కోరారు. తామేమీ అదనంగా కోరడంలేదని, పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Andhra Pradesh
Ganta Srinivasa Rao
Union Budget 2018-19
Narendra Modi
hari babu
  • Loading...

More Telugu News