Mani Shankar Aiyar: పాక్ నన్ను ఇష్టపడుతుంటే...భారత్ ద్వేషిస్తోందన్న మణి శంకర్‌ అయ్యర్‌పై దేశద్రోహం కేసు!

  • కరాచీ సాహితీ ఉత్సవంలో వివాదాస్పద వ్యాఖ్యలు
  • భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న పిటిషనర్
  • ఈ నెల 20న కేసు విచారణ

పాకిస్థాన్‍‌ అనుకూల వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయిన సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్‌పై రాజస్థాన్, కోటాలోని అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో దేశద్రోహం, పరువునష్టం కేసు నమోదయింది.

తొమ్మిదో కరాచీ సాహితీ మహోత్సవం సందర్భంగా అయ్యర్ పాకిస్థాన్‌ అంటే ఇష్టమని చెప్పడం, ఆ దేశాన్ని ప్రశంసించడమే కాక భారత్‌ను కించపరిచారంటూ బీజేపీ కోటా జిల్లా ఓబీసీ విభాగం అధ్యక్షుడు అశోక్ చౌదరి ఐపీసీలోని సెక్షన్ 124 (ఏ), సెక్షన్ 500, సెక్షన్ 504 కింద కేసు దాఖలు చేశారు. పాకిస్థాన్ అంటే తనకు ఇష్టమని, ఆ దేశానికి కూడా తానంటే అంతే ఇష్టముందని, భారత్ మాత్రం అంతే స్థాయిలో ద్వేషిస్తోందంటూ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చౌదరి తన పిటిషన్‌లో ఆరోపించారు.

పాకిస్థాన్‌తో చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ ఆసక్తి చూపించడం లేదంటూ తన వ్యాఖ్యల ద్వారా భారత్‌ను కించపరిచారని కూడా పిటిషనర్ పేర్కొన్నారు. "పాకిస్థాన్‌కి అనుకూలంగా అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నా దేశభక్తిని, భారతీయుల మనోభావాలను గాయపరిచాయి" అని చౌదరి మండిపడ్డారు.

పాకిస్థాన్ సహకారంతో భారత సైన్యంపై ఉగ్రవాదులు ఓ వైపు దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదానికి పాకిస్థాన్ చేయూతనందిస్తోందన్న విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలిపేందుకు దేశ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అయ్యర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న కేసు విచారణ జరగనుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News