Jagan: జగన్ కన్నా నెలరోజుల ముందే... కేంద్రంపై ఒత్తిడికి టీడీపీ ప్లాన్ ఇది!
- ఏప్రిల్ 6 తన డెడ్ లైన్ గా చెప్పిన జగన్
- మార్చి 5లోగా హామీలు అమలు చేయాల్సిందేనన్న చంద్రబాబు
- లేకుంటే కేంద్ర మంత్రుల రాజీనామా
- అప్పటికీ దిగిరాకుంటే బీజేపీతో కటీఫ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే, ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని సంచలన ప్రకటన చేసి, అధికార తెలుగుదేశం పార్టీని వైఎస్ జగన్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడవేయగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో చంద్రబాబునాయుడు అంతకన్నా నెలరోజుల ముందు... అంటే మార్చి 5లోపు రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనని తేల్చి చెబుతూ డెడ్ లైన్ పెట్టేశారు.
టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఈ విషయంలో వాడివేడిగా చర్చ సాగగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రణాళికను చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. బడ్జెట్ మలివిడత సమావేశాలు వచ్చే నెల 5 నుంచి మొదలవుతాయని గుర్తు చేసిన ఆయన, ఈలోగా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే, తొలుత కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని సూచించారు. ఇప్పటికే రైల్వే జోన్, రెవెన్యూ లోటు, కొత్త ఓడరేవు వంటి అంశాలపై కేంద్రం కదిలిందని, అయితే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మాత్రం మొదలు కాలేదని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మార్చి 5లోగా కేంద్రం స్పందించకుంటే, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా, ఆపై సభలో నిరసనలు, తరువాత బీజేపీతో మిత్ర బంధాన్ని తెంచుకుని, ఎన్డీయే నుంచి వైదొలగేంత వరకూ అంచలంచెలుగా ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. తాను గత మూడున్నరేళ్లలో బీజేపీని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని, హామీల అమలుకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా, అన్ని రాష్ట్రాలతో సమానంగా చూశారే తప్ప, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ లభించలేదని వాపోయిన చంద్రబాబు, ఇక లెక్కలు చెబితే వినబోనని, విభజన హామీల అమలుతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.