Indian Army: ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది పాక్ సైనికులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ!

  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాక్
  • భారత దళాల కాల్పుల్లో 20 మంది పాక్ సైనికుల హతం
  • పాక్ కాల్పుల్లో 16 మంది భారత సైనికుల వీర మరణం

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 20 మంది పాక్ సైనికులను భారత సైన్యం హతమార్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతున్న గెరిల్లా ఆపరేషన్ల అణచివేతలో భాగంగా జరిపిన కాల్పుల్లో వీరు మరణించగా, మరెందరో గాయాలపాలయ్యారు.

అలాగే , లైట్ ఫీల్డ్ గన్స్, 120 ఎంఎం మోర్టార్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు తదితర వాటితో జరిపిన కాల్పుల్లో  పాకిస్థాన్‌కు చెందిన పలు ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి 778 కిలోమీటర్ల పొడవునా ఉండే బాల్నోయ్, మెంధార్, కలాల్, కేరన్, దోడ, సర్లా, లాలీలి, బన్వత్ ప్రాంతాల్లో గత నాలుగైదు నెలలుగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.  

గతవారం జమ్ములోని సుంజువాన్ ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాక్ దళాలు ఈ ఏడాది ఇప్పటి వరకు 16 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్నాయి. ఇప్పటి వరకు 280 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News