Arvind Kejriwal: కేవలం ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెట్టిన కేజ్రీవాల్ ప్రభుత్వం
- ఏటా సగటున రూ. 70.5 కోట్ల ఖర్చు
- 2015లో ప్రకటనలకు రూ. 59.9 కోట్ల ఖర్చు
- 2016లో రూ.66.3 కోట్లు.. గతేడాది రూ. 85.3 కోట్లు
- గత కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.17.4 కోట్లు మాత్రమే
గతంలో అతిథులకు ఛాయ్, బిస్కెట్స్, సమోసాల కోసం భారీగా ఖర్చుచేసి వార్తల్లోకెక్కిన ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటనల నిమిత్తం ఏటా సగటున రూ. 70.5 కోట్లను ఖర్చు చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఉపయోగిస్తూ ఓ వార్త సంస్థ ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా సమాధానం ఇచ్చింది. 2015లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటనలకు రూ. 59.9 కోట్లు, 2016లో రూ.66.3 కోట్లు, గతేడాది రూ. 85.3 కోట్లను ఖర్చుచేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మూడేళ్లలో సగటున రూ.70.5 కోట్లను ఖర్చు చేయగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 నుంచి 2013 వరకు ప్రకటనల కోసం రూ.17.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పత్రికల్లో సీఎం, మంత్రులతో కూడిన ప్రకటనలు, టీవీ, రేడియో, ప్రభుత్వం వెలువరించే టెండర్ ప్రకటనలకు తాము ఈ ఖర్చు చేశామని కేజ్రీవాల్ సర్కారు తెలిపింది.