Garib Rath train: రెండు గంటల సేపు కనిపించకుండా పోయిన గరీబ్ రథ్ రైలు!
- అమృత్ సర్ నుంచి సహర్సాకు బయల్దేరిన గరీబ్ రథ్
- మార్గ మధ్యంలో వేరే రూట్లో వెళ్లిన రైలు
- గంటన్నర తర్వాత గుర్తించిన డ్రైవర్
పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి బీహార్ లోని సహర్సాకు బయలుదేరిన గరీబ్ రథ్ రైలు మార్గమధ్యంలో ఏకంగా రెండు గంటలసేపు కనిపించకుండా పోయింది. రెండు గంటల తర్వాత కానీ, ఆ రైలు ఎక్కడుందో అధికారులకు తెలియరాలేదు. వాస్తవానికి తన ప్రయాణంలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జంక్షన్ నుంచి మొరాదాబాద్ రూట్లో రైలు వెళ్లాలి.
కానీ, పొరపాటున అది అలీఘర్ దారిలో వెళ్లింది. దాదాపు గంటన్నరసేపు ప్రయాణించిన తర్వాత తాము వేరే మార్గంలో ప్రయాణిస్తున్నామనే విషయాన్ని గుర్తించిన డ్రైవర్... వెంటనే రైలును ఆపేశాడు. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపాడు. తక్షణమే అక్కడకు బయల్దేరి వెళ్లిన అధికారులు, రైలును మళ్లీ ఘజియాబాద్ జంక్షన్ కు మళ్లించారు. అనంతరం అక్కడి నుంచి మొరాదాబాద్ కు పంపించారు. ఇదే సమయంలో ఎంతకూ రైలు రాకపోవడంతో మొరాదాబాద్ లో రైల్వే అధికారులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.