Krishna Kumari: పాక్ సెనేట్‌కి పోటీ పడుతున్న మరో హిందూ మహిళ!

  • పీపీపీ తరపున తొలి సెనేటర్‌గా రత్నభగవాన్‌దాస్ చావ్లా
  • సెనేట్‌కు ఎన్నికైతే సింధ్ ప్రావిన్స్‌కు కృష్ణకుమారి ప్రాతినిధ్యం
  • ఎస్సీ వర్గానికి చెందిన మొట్టమొదటి హిందూ మహిళ కూడా

పాకిస్థాన్ పార్లమెంటులోని ఎగువసభ (సెనేట్‌)కు వచ్చే నెల 3న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థిగా సామాజిక కార్యకర్త కృష్ణకుమారి పోటీ చేస్తున్నారు. తద్వారా పీపీపీ తరపున సెనేట్‌కు నామినేట్ అయిన రెండో హిందూ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు పీపీపీ తరపున పాక్ సెనేట్‌లో అడుగుపెట్టిన ఏకైక హిందూ సభ్యురాలు రత్న భగవాన్‌దాస్ చావ్లా మాత్రమే. ఇపుడు కృష్ణకుమారి పేరును అదే పార్టీ నామినేట్ చేయడంతో పాక్ పార్లమెంటులో రెండో మహిళా హిందూ సెనేటర్‌గా ఆమె అవతరించనున్నారు. అంతేకాక కృష్ణకుమారి ఎస్సీ వర్గానికి చెందిన మొట్ట మొదటి హిందూ మహిళ కూడా కావడం గమనార్హం.

చావ్లా 2006-2012 మధ్యకాలంలో సింధ్ ప్రావిన్స్‌కు సెనేటర్‌గా ప్రాతినిధ్యం వహించారు. ఒకవేళ కుమారి కూడా ఎన్నికైతే అదే నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తారు. కోహ్లీ కమ్యూనిటీలో పుట్టిన కృష్ణకుమారి చిన్నతనంలోనే తన కుటుంబంతో పాటు కట్టుబానిసగా విక్రయమయ్యారు. అయితే పోలీసుల దాడుల్లో ఆమె కట్టు బానిసత్వం నుండి విముక్తి పొందారని ది డాన్ పత్రిక తెలిపింది. ఆమెకు 16 ఏళ్ల ప్రాయంలోనే వివాహమయింది. పెళ్లి తర్వాతే ఆమె విద్యను కొనసాగించి సోషియాలజీలో పీజీ పూర్తి చేశారు. మహిళల హక్కులు, కట్టు బానిసత్వం, వృత్తిక్షేత్రాల్లో మహిళలపై లైంగిక వేధింపులు తదితర సమస్యలపై ఆమె పోరాటం చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Krishna Kumari
Pakistan People's Party
Dawn
Ratna Bhagwandas Chawla
  • Loading...

More Telugu News