love: ప్రేమతో జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ... 600 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర
- పుట్టింటికి వెళ్లి తప్పిపోయిన భార్య
- ఎంతకీ తిరిగిరాకపోవడంతో సైకిల్ పై ప్రయాణం
- ఓ పేపర్, పోలీసుల సాయంతో ఒక్కటైన ఇద్దరు
ప్రేమ అంటే ఏంటి? అని అడిగితే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున యువత ఎన్నో కొటేషన్లు చెబుతుంది. 42 ఏళ్ల జార్ఖండ్ వాసి మాత్రం ప్రేమ అంటే ఏంటో తన చేతల్లో చూపించాడు. తప్పిపోయిన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ 600 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేశాడు. అతడి పేరు మనోహర్ నాయక్. జార్ఖండ్ లోని ముసాబని పట్టణం సమీపంలో ఉన్న బలిగోడ గ్రామ వాసి.
నాయక్ భార్య అనిత మకర సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పశ్చిమ బెంగాల్ లోని స్వగ్రామం కుమ్రాసోల్ కు జనవరిలో వెళ్లింది. కానీ రెండు రోజులు దాటిపోయినా తిరిగి రాలేదు. మానసిక లోపం కారణంగా ఆమె మాట్లాడలేని పరిస్థితి. దీంతో నాయక్ లో ఆందోళన మొదలైంది.
పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ, పోలీసుల వల్ల కాదనుకున్నాడు. తన పాత సైకిల్ ను సిద్ధం చేసుకుని రోజూ 25 కిలోమీటర్ల చొప్పున 24 రోజుల పాటు ప్రయాణం చేసి భార్య స్వస్థలానికి చేరుకున్నాడు. అక్కడ భార్య అనిత కనిపించలేదు. స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రిక వారిని సంప్రదించడంతో ఆమె ఫొటోను ప్రచురించారు. దాన్ని చూసిన కొందరు ఆమెను ఖరగ్ పూర్ లో చూసినట్టు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో ఆమె ఎట్టకేలకు నాయక్ వద్దకు చేరింది.