Chandrababu: ఏడీఆర్ రిపోర్ట్: కేసీఆర్, చంద్రబాబులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇవి!

  • వివరాలు వెల్లడించిన ఏడీఆర్
  • ఇండియాలో 11 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
  • 8 మందిపై తీవ్ర నేరాలు
  • కేసీఆర్ పై రెండు, చంద్రబాబుపై మూడు కేసులు

ఇండియాలోని వివిధ రాష్ట్రాల సీఎంలు, వారి ఆస్తులు, వారిపై ఉన్న కేసులు తదితరాలతో కూడిన సమగ్ర నివేదికను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. ఇండియాలో 11 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, మిగతా 20 మందిపై ఎటువంటి కేసులూ లేవని ఏడీఆర్ పేర్కొంది. క్రిమినల్ కేసులున్నవారిలో 8 మంది తీవ్రమైన నేరారోపణలు కలిగివున్నారని వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు నిలిచారు. ఆయనపై 22 కేసులుండగా, వాటిల్లో 3 తీవ్రమైన నేరారోపణలు. ఇక రెండో స్థానంలో ఉన్న కేరళ సీఎం పినరయి విజయన్ పై 11 కేసులుండగా, వాటిల్లో ఒకటి తీవ్రమైన నేరం.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై 2 కేసులుండగా, వాటిల్లో ఒకటి తీవ్రమైన కేసు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం, వరంగల్ జేఎఫ్సీఎం కోర్టు ఒకటో అదనపు జడ్జి ముందు 2013 మార్చి 14న దాఖలైన కేసు విచారణ దశలో ఉంది. దీంతో పాటు ఐపీసీ సెక్షన్ 147, 117, 151, 188, 341, 353, 506, 149 సెక్షన్ల కింద సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. అధికారుల పనిని అడ్డుకోవడం, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా నిరసనలు తెలపడం, హింసకు ప్రోత్సహించడం, ప్రభుత్వ అధికారులపై చెయ్యి చేసుకోవడం, చట్ట విరుద్ధంగా ప్రవర్తించడం, ఐదుగురు అంతకన్నా ఎక్కువ మందితో కలసి నిషేధాజ్ఞలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విషయానికి వస్తే, ఆయనపై 3 సాధారణ నేరారోపణలు ఉన్నాయి. విచారణ దశలో ఉన్న ఈ మూడు కేసులపైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఆయనపై ఆదిలాబాద్ కోర్టులో ఒకటి, బొబ్బిలి కోర్టులో ఒకటి, నాంపల్లి కోర్టులో ఒక కేసు ఉన్నాయి. కోర్టు స్టే విధించి ఉన్నందున ఆయనపై ఉన్న అభియోగాల వివరాలను ఏడీఆర్ వెల్లడించలేదు. 

  • Loading...

More Telugu News