China: మాల్దీవుల విషయంలో భారత్‌ను మరోమారు హెచ్చరించిన చైనా
- భారత్ పేరెత్తకుండానే డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు
- సమస్య వారి అంతర్గత వ్యవహారమన్న చైనా
- ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసని వ్యాఖ్య
మాల్దీవుల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు భారత్‌ను హెచ్చరించింది. మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సాయం చేయాల్సిందిగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షోభ నివారణకు మిలటరీ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతో స్పందించిన చైనా భారత్ పేరెత్తకుండానే హెచ్చరించింది. మాల్దీవుల విషయంలో బయటి శక్తుల జోక్యాన్ని సహించబోమని పేర్కొంది. మాల్దీవుల్లో నెలకొన్న ప్రస్తుత సమస్య ఆ దేశ అంతర్గత విషయమని, దానిని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలని పేర్కొంది.
‘‘మాకు తెలిసినంత వరకు మాల్దీవుల్లో నెలకొన్న ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోగల సమర్థత ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ఉంది. చట్టప్రకారం సమస్యలను పరిష్కరించుకుని మునుపటి పరిస్థితులను పునరుద్ధరించుకుంటారు’’ అని చైనా ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిష్కారానికి నషీద్ భారత సాయాన్ని అర్ధించారు. అంతేకాదు.. తమ దేశ భూములను చైనా ఆక్రమించిందని, ఆర్కిపెలాగోలో 17 దీవులు చైనా అధీనంలో ఉన్నాయని ఆరోపించిన నషీద్.. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.