Maha Sivaratri: 'శంకరా, శుభకరా' అంటూ శివాలయాలు కిటకిట... ఇంద్రకీలాద్రిపై మల్లన్నకు జరగని ఉత్సవాలు!

  • వైభవంగా సాగుతున్న మహాశివరాత్రి
  • ఇంద్రకీలాద్రిపై ఆలయ జీర్ణోద్దరణ పనులు
  • ఉత్సవాల రద్దుతో భక్తుల నిరాశ
  • మిగతా ప్రాంతాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాన శైవక్షేత్రాలతో పాటు చిన్న చిన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్న వేళ, కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రి మాత్రం వెలవెలబోతోంది. కొండపై ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరగడం లేదు. కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులలో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్దరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. ఆలయ పనులు శివరాత్రి నాటికి పూర్తి చేయాలని అధికారులు తొలుత భావించినప్పటికీ, అవి పూర్తి కాలేదు. దీంతో ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు రద్దయ్యాయి. విషయం తెలియక కొండపైకి వస్తున్న భక్తులు మల్లన్న దర్శనం లేకుండానే ఉసూరుమంటూ వెనక్కు తిరగాల్సిన పరిస్థితి.

ఇక శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తిలో  శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నారు.  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

 యనమలకుదురు రామలింగేశ్వర ఆలయం, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడ వన్ టౌన్ లోని శివాలయం, గుంటూరు జిల్లా సత్రశాల, ప్రకాశం జిల్లా పునుగోడు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

గుంటూరు జిల్లా కోటప్పకొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. సుమారు 20కి పైగా భారీ ప్రభలు త్రికోటేశ్వరుని ముందు కొలువుదీరాయి. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నేడు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని, నేడు రెండు లక్షల మంది వరకూ దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.

Maha Sivaratri
Indrakeeladri
Mallanna
Vijayawada
  • Loading...

More Telugu News