Butta Renuka: కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై సస్పెన్షన్ వేటు పడనుందా?

  • ఎంపీగా ఉంటూనే మరో లాభదాయక పదవిలో రేణుక
  • వేటుకు సిఫారసు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం
  • తనను ప్రభుత్వమే నియమించిందన్న రేణుక

కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు పదవీ గండం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా ఉంటూనే మరో లాభదాయక పదవిని అనుభవిస్తున్నందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీగా ఉన్న రేణుక కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) జనరల్ బాడీ సభ్యురాలిగా కూడా వున్నారు. దీనిని లాభదాయకమైన పదవిగా పేర్కొన్న పార్లమెంటరీ స్థాయి సంఘం ఆమెపై చర్యలకు సిఫారసు చేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.

నిజానికి జూలై 26, 2016లో లోక్‌సభ నుంచి బుట్టా రేణుక, రావత్‌లను సీఎస్‌డబ్ల్యూబీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో ఇది లాభదాయక పదవి అని తేలింది. దీంతో ఈ బోర్డులో సభ్యులుగా ఉన్న వారిపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది.

ఎంపీగా ఉంటూనే మరో లాభదాయకమైన పదవిని అనుభవిస్తున్నట్టు వస్తున్న వార్తలపై రేణుక స్పందించారు. తనను ప్రభుత్వమే బోర్డులో నియమించిందని, ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు సిఫారసు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. సభ్యురాలిగా ఉన్నప్పటికీ బోర్డు నుంచి తాను ఎటువంటి జీతభత్యాలను అందుకోవడం లేదని రేణుక స్పష్టం చేశారు.

Butta Renuka
MP
Karnool
Andhra Pradesh
  • Loading...

More Telugu News