Maha Sivaratri: సందిగ్ధం: మహా శివరాత్రి రేపా? ఎల్లుండా?!
- 13వ తేదీన జరిపేందుకు శైవక్షేత్రాల్లో ఏర్పాట్లు
- ద్రాక్షారామం, సోమారామాల్లో ఎల్లుండి పర్వదినం
- భక్తుల్లో నెలకొన్న సందిగ్ధత
ఈ సంవత్సరం మహా శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలన్న విషయమై ఇప్పటికీ పండితులు ఓ అభిప్రాయానికి రాకపోవడంతో ఉపవాస దీక్ష ఎప్పుడు చేపట్టాలన్న విషయమై కోట్లాది మంది భక్తుల్లో అయోమయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో శివరాత్రిని 13వ తేదీ మంగళవారం (రేపు), మరికొన్ని ప్రాంతాల్లో 14వ తేదీ బుధవారం (ఎల్లుండి)కి శివరాత్రి ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కోటప్పకొండ, సత్రశాల, గొట్టిపాళ్ల, అమరావతి తదితర ప్రాంతాల్లో రేపు శివరాత్రిని జరుపుకోనుండగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పంచారామ శైవక్షేత్రాల్లో భాగమైన ద్రాక్షారామం, సోమారామాల్లో ఎల్లుండి పర్వదినం జరగనుంది. దీంతో భక్తుల్లో సందిగ్ధం నెలకొంది.
మహాదేవుడు లింగావతారంగా అవతరించిన రోజే మహా శివరాత్రి పర్వదినం అన్నది అందరికీ తెలిసిందే. చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ చతుర్దశి ఈ నెల 13వ తేదీన ఉందని అంటున్నారు. మరికొందరు చతుర్దశి 14న అధిక సమయం తిథి ఉందని చెబుతూ ఆ రోజునే పండగ అంటున్నారు. లింగోద్భవ పూజలు రాత్రిపూట జరుగుతాయని, రాత్రిపూట చతుర్థశి మంగళవారమే ఉంది కాబట్టి శివరాత్రి మంగళవారమేనని అత్యధికులు చెబుతున్న పరిస్థితి. పంచాంగకర్తల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.